రివ్యూ : ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి

రివ్యూ : ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి

మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అయిన ‘వికృతి’ చిత్రాన్ని తెలుగులో ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ప్రముఖ నటుడు అలీ.. తన అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రధారులుగా అలీ హీరోగా మౌర్యాని హీరోయిన్ గా నటించారు. కాగా ఈ చిత్రం నేడు ఆహా లో స్ట్రీమింగ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

కథ :

నరేష్ (శ్రీనివాసరావు ) – పవిత్ర లోకేష్ (సునీత) ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు. వయసు మీద పడుతున్నా ఇద్దరూ ఒకరి పై ఒకరు అపారమైన ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. ఇలా కొడుకు కూతురితో ఎంతో సంతోషంగా ఉన్న నరేష్ – పవిత్రా లోకేష్ జీవితాలు.. అలీ (మహమ్మద్ సమీర్) తీసిన ఓ ఫోటో కారణంగా అస్తవ్యస్తంగా మారతాయి. దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిన అలీ (మహమ్మద్ సమీర్)కి సెల్ఫీల పిచ్చి. ఆ పిచ్చితోనే ఓ పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఇంతకీ ఏమిటి ఆ సమస్య ?, ఈ మధ్యలో అలీ దిల్ రుబాతో (హీరోయిన్ మౌర్యాని) ఎలా ప్రేమలో పడ్డాడు ?, వీళ్ల ప్రేమ.. పెళ్ళికి దారి తీసిందా ?, లేదా ?. చివరకు నరేష్ (శ్రీనివాసరావు ) – పవిత్ర లోకేష్ (సునీత) జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

సినిమా చూస్తున్నంత సేపూ మన నిజ జీవితంలోని పాత్రలనే మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కథలోని సెన్సిటీవ్ ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా భావోద్వేగమైన పాత్రలతో కూడా సున్నితమైన హాస్యాన్ని పండించిన విధానం అబ్బురపరుస్తుంది. అలాగే ప్రధానంగా సాగే నరేష్ – పవిత్రా లోకేష్ మధ్య ప్రేమ, బాధ ప్రేక్షకుడ్ని సినిమాతో పాటే ప్రయాణించేలా చేస్తాయి. వీటితో పాటు సినిమాలోని మెయిన్ కంటెంట్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది. కథనంలో ఎక్కడా ఫ్లో తగ్గకుండా ప్రతి ఐదు నిముషాలకు ఒక ఎమోషనల్ సీన్, లేదా ఒక ఫన్ సీన్ వస్తూ సినిమా పై ఆసక్తిని పెంచుతాయి. దాంతో పాటు ప్రతి పాత్ర అర్ధవంతగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది. పైగా ఈ సినిమాలో సోషల్ మీడియా ద్వారా ఒక సాధారణ మనిషి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాడు అనే కోణంలో కొన్ని కఠినమైన వాస్తవాలను చాలా వాస్తవికంగా చూపించడం చాలా బాగా ఆకట్టుకుంటుంది.

హాస్య నటుడిగా అలీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఈ చిత్రంలో అలీ హీరోగా కూడా చాలా బాగా మెప్పించాడు. తన పాత్రకు తన నటనతో ప్రాణం పోశాడు. పక్కింటి ఫ్రెండ్ పాత్రలో సింగర్ మను ఆకట్టుకున్నాడు. కథను మలుపు తిప్పే మరో కీలక పాత్రలో నటించిన లాస్య చక్కగా నటించింది. ఆమె పాత్ర కారణంగానే సినిమాలో టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంటుంది. ఇక చిన్న చిన్న క్యారెక్టర్స్ కి కూడా పెద్ద పెద్ద నటీనటులను తీసుకున్నారు. ఈ సినిమాకి ఇది బాగా ప్లస్ కానుంది. అలాగే సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ను డిజైన్ చేయడం చాలా బాగుంది. ఆ కారణంగా మలయాళం సూపర్ హిట్ అయిన ఒరిజినల్ మూవీ వికృతి కంటే.. ఈ సినిమా ఒక మెట్టు పైనే ఉంది. సినిమా చివరకి వచ్చేసరికి పాత్రలకు ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను దర్శకుడు బాగా మెయిటైన్ చేశాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా మీద మంచి భావేద్వేగంతో కూడుకున్న అనుభూతి కలుగుతుంది.

అదే విధంగా ఈ కథలో నరేష్ – పవిత్రా లోకేష్ మరోసారి అద్భుతమైన ఎమోషనల్ కెమిస్ట్రీని పండించారు.( నరేష్ – పవిత్రా నిజ జీవితంలో కెమిస్ట్రీనే ఈ సినిమాలో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది). ఇక నరేష్ – పవిత్రా లోకేష్ పాత్రల జీవితాల్లో.. అలీ పాత్ర ఎలాంటి అలజడి సృష్టించిందనే కోణంలో వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఈ సినిమాలో చివరిదాకా ఏం జరుగుతుందో.. హీరో అలీ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే పాయింట్ ను అండ్ ట్విస్ట్ ను దర్శకుడు చాలా ఇంట్రస్ట్ గా చెప్పాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా పై ముఖ్యంగా అలీ నటన పై, నరేష్ – పవిత్రా లోకేష్ ల మధ్య కెమిస్ట్రీ పై గౌరవం పెరుగుతుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల దారులుగా నటించిన మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని ఈ సినిమాలో మీరు చూడొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

అలీ నటన,

నరేష్ – పవిత్రా లోకేష్ మధ్య కెమిస్ట్రీ,

ఎమోషనల్ సీన్స్,

మెయిన్ థీమ,

కొన్ని ఫ్యామిలీ ఎపిసోడ్స్,

సంగీతం.

తీర్పు :

ఎమోషనల్ డిజిటల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. దీనికితోడు నరేష్ – పవిత్రా లోకేష్ మధ్య కెమిస్ట్రీ, అండ్ అలీ నటన వంటి అంశాలు కారణంగా ఈ సినిమా మరో లెవల్ కి వెళ్లింది. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి సూపర్ స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించిన సినిమా ఇది. పైగా అనేక భావోద్వేగాల సమ్మేళనంలా సాగిన ఈ సినిమా తెలుగు న్యాచురల్ సినిమాల్లో మరో సినిమాగా నిలిచిపోతుంది. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులని చాలా బాగా అలరిస్తుంది.

రేటింగ్ : 3.25 / 5

బోటమ్ లైన్ : మెప్పించే ఎమోషనల్ డిజిటల్ ఫ్యామిలీ డ్రామా

బ్యానర్‌: అలీవుడ్‌ ఎంటర్‌ టైన్మెంట్స్‌,

నిర్మాతలు : కొనతాల మోహన్‌

రచన, దర్శకత్వం: శ్రీపురం కిరణ్‌

డిఓపి : ఎస్‌. మురళి మోహన్‌ రెడ్డి

సంగీతం : రాకేశ్‌ పళిడమ్‌

పాటలు : భాస్కరభట్ల రవికుమార్‌

ఎడిటర్‌ : సెల్వకుమార్‌